![]() |
| DON |
Directed - Cibi Chakaravarthi
రేటింగ్: 2.25 / 5
Written - Cibi Chakaravarthi
Produced - Allirajah Subaskaran,Sivakarthikeyan
Starring - Sivakarthikeyan, S. J. Suryah, Priyanka Arul Mohan, Samuthirakani
Cinematography - K. M. Bhaskaran
Edited - Nagooran Ramachandran
Music - Anirudh Ravichander
𝗦𝘁𝗼𝗿𝘆
చక్రవర్తి (శివ కార్తికేయన్)కి మొదటి నుండి తండ్రి (సముతిర కని) అంటే పడదు. పెంపకం విషయంలోనే కాదు చదువు విషయంలోనూ ఆయన కఠినంగా వ్యవహరిస్తుండటంతో తన పాలిట ఓ విలన్ అనే భావనతో చక్రవర్తి ఉంటాడు. ఆర్ట్స్ లో చేరాలనుకున్న చక్రవర్తిని తండ్రి బలవంతంగా ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పిస్తాడు. యేడాదికేడాదికి బ్యాక్ లాగ్స్ పెరుగుతున్నా, తండ్రికి మాత్రం పాస్ అయినట్టుగా అబద్ధం చెబుతుంటాడు. కాలేజీ డిసిప్లిన్ కమిటీ హెడ్ భూమినాదం (ఎస్.జె. సూర్య) కు చక్రవర్తి చుక్కలు చూపించి, డాన్ అనే గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే డైరెక్టర్ కావాలనే తన కోరికను చక్రవర్తి ఎలా తీర్చుకున్నాడు? అందుకోసం అతని స్నేహితురాలు ఆకాశవాణి (ప్రియాంక మోహన్) ఎలా సాయం చేసింది? తన పగవాళ్ళుగా భావించిన తండ్రి, భూమినాదంపై చక్రవర్తి అభిప్రాయాలు ఎలా మారిపోయాయి? అనేది మిగతా సినిమా.
పిల్లల ఆలోచనలతో నిమిత్తం లేకుండా వాళ్ళను ఓ చట్రంలో బిగించి ఇంజనీర్స్ చేయాలనుకునే తండ్రులకు ఈ సినిమా ఓ కనువిప్పు. ఇంజనీరింగ్ కాలేజీల్లో యువతలోని ప్రతిభలను గుర్తించి ప్రోత్సహించకుండా, వారిని మరమనుషులుగా తయారు చేయడం సబబు కాదని దర్శకుడు ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నాడు. అదే సమయంలో కాలేజీలోని ఉపాధ్యాయులు పైకి కఠినాత్ముల్లా కనిపించినా, వారిలోనూ మంచి మనసు ఉంటుందని చూపించాడు. కన్న బిడ్డలు సక్రమమార్గంలో సాగాలనే తపనతో తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించడం వల్ల విలన్స్ గా కనిపిస్తుంటారని కానీ అందులో వాస్తవం లేదని దర్శకుడు తెలిపాడు. ఈ రెండు అంశాలను డీల్ చేస్తూ గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఇంజనీరింగ్ కాలేజీలు, వారి నిర్వహణ, విద్యార్థులపై తీవ్రప్రభావం చూపించే ర్యాకింగ్ విధానంపై ‘త్రీ ఇడియట్స్’ సినిమా వచ్చింది. ఇక తండ్రి గొప్పతనాన్ని బతికుండగా కొడుకులు తెలుసుకోలేకపోవడం మీద చాలానే చిత్రాలు వచ్చాయి. ‘డాన్’ మూవీలో విలన్ అనే వాళ్ళు లేకుండా అన్ని పాత్రలను పాజిటివ్ క్యారెక్టర్స్ గా మలచడానికి దర్శకుడు చాలా తాపత్రయ పడ్డాడు.
హీరో కు తండ్రితో ఉన్న వైరాన్ని చూపించినంత బలంగా, ఆ కాఠిన్యం వెనుక ఉన్న ప్రేమను చూపడంలోనూ కాలేజీలో భూమినాదం పై హీరో కక్షతీర్చుకోవడంలోని ఇంటెన్సిటీ ఆ తర్వాత ప్రేమను వ్యక్తం చేయడంలో మిస్ అయ్యింది. ఈ రెండు అంశాలను విడమర్చి చెప్పడానికి దర్శకుడికి సమయం సరిపోలేదు. ప్రధమార్థం అంతా అనవసరమైన సన్నివేశాలతో నింపేయడంతో పేలవంగా తయారైంది. నిజానికి చివరి అరగంట సినిమానే జనాన్ని కట్టిపడేస్తుంది. డైరెక్టర్ కావాలనుకున్న చక్రవర్తి కోరిక తీరిందనే విషయాన్ని మాటల్లో తేల్చేశారు. చిత్రం ఏమంటే… షార్ట్ ఫిల్మ్ మేకర్ గా చక్రవర్తి పేరు తెర మీద కనిపించేసరికీ ప్రేక్షకులకు సినిమా అయిపోయిందనే భావనతో సీట్లలోంచి లేచి బయటకు వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత కాన్వకేషన్ లో హీరో చెప్పే నీతివాక్యాలు వినడానికి ఖాళీ సీట్లే మిగిలాయి. స్క్రీన్ ప్లేను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు శిబి చక్రవర్తి విఫలం కావడమే దీనికి కారణం. కాలేజీలోని అనవసర సన్నివేశాలను ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. ఇక హీరో ప్రయోజకుడు అయ్యే సమయంలో తండ్రి మరణించడం, ఎంతో కష్టపడి తీసిన తొలి షార్ట్ ఫిల్మ్ పాడైపోవడం వంటి సన్నివేశాలు తమిళ అతిని చాటాయి!
నటీనటుల విషయానికి వస్తే… శివ కార్తికేయన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ గా బాగానే చేశాడు. ప్రియాంక అరుల్ మోహన్ కు ఇదేమీ కొత్తదనం ఉన్న పాత్ర కాదు. పేరుకే హీరోయిన్ కానీ ఆమె పాత్రకు పెద్దంత ప్రాధాన్యం లేదు. సినిమా మొత్తం మీద ఆకట్టుకున్న వారు ఇద్దరే. ఒకరు సముతిర కని, రెండు ఎస్.జె. సూర్య. కాలేజ్ డిసిప్లిన్ కమిటీ హెడ్ గా సూర్య కొన్ని చోట్ల అతిగా నటించినా, బాడీ లాంగ్వేజ్ సూపర్ గా ఉంది. ఇతర పాత్రలను రాధారవి, సూరి, ఆధిర పాండిలక్ష్మి, మనోబాల, శివంగి కృష్ణకుమార్ తదితరులు పోషించారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తన నిజ జీవిత పాత్రలోనే గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. అనిరుథ్ సంగీతం ఏమంత గొప్పగా లేదు. కె. ఎం. భాస్కరన్ సినిమాటోగ్రఫీ ఓకే. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి శివ కార్తికేయన్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. కెరీర్ విషయంలో పిల్లలకు స్వేచ్ఛనివ్వాలని చెబుతూనే, తల్లిదండ్రుల గొప్పతనాన్ని వాళ్ళు బతికి ఉండగానే గుర్తించాలని ఇచ్చిన సందేశం మంచిదే అయినా… దాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు.






0 Reviews